నారా లోకేశ్ నాయకత్వ లక్షణాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: పంచుమర్తి అనురాధ

నారా లోకేశ్ నాయకత్వ లక్షణాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: పంచుమర్తి అనురాధ

Nara Lokesh leadership qualities cannot be tolerated by Goddali party says Panchumarthi Anuradha
  • కూటమి ప్రభుత్వం రెండేళ్లలో 8 లక్షల ఉద్యోగాలు కల్పించిందన్న అనురాధ
  • లోకేశ్ నాయకత్వాన్ని చూసి గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం
  • జగన్ పాలనలో డీఎస్సీ నియామకాలు సున్నా అని విమర్శ
  • ఏపీపీఎస్సీలో రూ.150 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో 8 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. లోకేశ్ నాయకత్వ పటిమను, పనితీరును చూసి ఓర్వలేకే ‘గొడ్డలి పార్టీ’ (వైసీపీ) ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, ఎంఎస్‌ఎంఈ, స్కిల్ డెవలప్‌మెంట్, ఐటీ, పర్యాటక రంగాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని అనురాధ వివరించారు. అయితే, లోకేశ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని, ఆయన హయాంలో నిరుద్యోగితలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని విమర్శించారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం దాదాపు 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ విధానాల వల్లే అదానీ గ్రూప్, లులూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కియా అనుబంధ పరిశ్రమలు, అమర్‌రాజా బ్యాటరీస్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని అనురాధ ఆరోపించారు. యువతను గంజాయికి బానిసలుగా మార్చి, వారి భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. 

ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణలో రూ.150 కోట్ల స్కామ్ బయటపడిందని, ప్రభుత్వ స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్లను ప్రైవేట్ రిసార్టులకు తరలించి అనర్హులతో మూల్యాంకనం చేయించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తన 16 నెలల జైలు జీవితం, తండ్రి శవం పక్కన సంతకాల సేకరణ, 31 క్రిమినల్ కేసులు, వివేకా హత్య వంటి అంశాలపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 16 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అనురాధ ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు యూనివర్సిటీలు, కళాశాలలకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగ కల్పన కార్యక్రమాలను, మెగా డీఎస్సీ పారదర్శకతను వివరిస్తారని తెలిపారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అక్రమాలను కూడా యువతకు తెలియజేస్తారని చెప్పారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న గొడ్డలి పార్టీ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Nara Lokesh
Panchumarthi Anuradha
Mega DSC Andhra Pradesh
Andhra Pradesh Job Creation
APPSC Scam Investigation
Yuvatha Bhavithaku Bharosa

More Telugu News