షేక్ హసీనా తిరుగు ప్రయాణం ముంగిట షాక్: ఏడుగురు అవామీ లీగ్ నేతలకు ఉరిశిక్ష

షేక్ హసీనా తిరుగు ప్రయాణం ముంగిట షాక్: ఏడుగురు అవామీ లీగ్ నేతలకు ఉరిశిక్ష

Sheikh Hasina return announcement followed by death sentence for seven Awami League leaders
  • డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్ వస్తానని ప్రకటించిన షేక్ హసీనా
  • ఇప్పటికే హసీనాకు ఉరిశిక్ష విధించిన ట్రైబ్యునల్
  • అవామీ లీగ్ నేతలకు ఉరిశిక్ష విధించిన అదే ట్రైబ్యునల్

బంగ్లాదేశ్ రాజకీయంలో మరోసారి సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే డిసెంబర్‌లో భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అవామీ లీగ్ పక్షానికి అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. 2024లో చోటుచేసుకున్న విద్యార్థుల పోరాటం, ఉద్యమ అణచివేత కేసులో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్‌తో సహా ఏడుగురు సీనియర్ నాయకులకు మరణశిక్ష ఖరారు చేస్తూ జస్టిస్ నజ్రుల్ ఇస్లామ్ చౌదరి నేతృత్వంలోని ట్రైబ్యునల్ మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.


ఉరిశిక్ష పడిన నేతలు:

  • ఒబైదుల్ ఖాదర్: ఆవామీ లీగ్ జనరల్ సెక్రటరీ & మాజీ మంత్రి

  • బహావుద్దీన్ నసీమ్: జాయింట్ జనరల్ సెక్రటరీ

  • మహ్మద్ అలీ అరాఫత్: మాజీ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి

  • షేఖ్ ఫజల్ షమ్స్ పరాష్, మైనుల్ హుస్సేన్ ఖాన్ నిఖిల్: జుబో లీగ్ నేతలు

  • సద్దాం హుస్సేన్: ఛాత్ర లీగ్ అధ్యక్షుడు 

  • షేక్ వలీ ఆసిఫ్: ఛాత్ర లీగ్ జనరల్ సెక్రటరీ


2024 జూలై-ఆగస్టు నెలల్లో దేశంలో హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థుల ఉద్యమంపై విచక్షణారహితంగా దాడులు చేయించడం, హత్యలకు పురికొల్పడం, ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు రుజువు కావడంతో ఈ శిక్షలు విధించారు. గతంలోనే మాజీ ప్రధాని షేఖ్ హసీనాపై కూడా ఇదే ట్రైబ్యూనల్ మరణశిక్షను విధించిన సంగతి తెలిసిందే. తాను డిసెంబర్ నాటికైనా బంగ్లాదేశ్ చేరుకుని న్యాయస్థానాన్ని ఎదుర్కొంటానని హసీనా ప్రకటన చేసిన కొన్ని నెలల్లోనే, ఆమె ప్రధాన అనుచర బృందానికి విధించిన ఈ తీవ్రమైన తీర్పు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Sheikh Hasina
Awami League leaders death sentence
Bangladesh International Crimes Tribunal
Obaidul Quader death penalty
Bangladesh student protest 2024
Bangladesh political crisis

More Telugu News