2029 నాటికి అర్హులందరికీ సొంతిల్లు.. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

2029 నాటికి అర్హులందరికీ సొంతిల్లు.. గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu aims for own houses for all eligible by 2029 review on housing department
  • 2027 మార్చి నాటికి 5.52 లక్షల గృహాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశం
  • ఉచిత ఇళ్ల స్థలాల కోసం పారదర్శక విధానం అమలు చేయాలని సూచన
  • కేంద్ర సహకారంతో రాష్ట్రంలో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళిక
  • కుప్పం నియోజకవర్గంలో సంతృప్త స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్దేశం
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన గృహాన్ని అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'హౌసింగ్ ఫర్ ఆల్' కార్యక్రమాన్ని సాచురేషన్ విధానంలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు ఆ శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), పీఎం జన్ మన్ వంటి వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణ పనులను వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. డిసెంబరు 2026 నాటికి 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో పీఎంఏవై 1.0, 2.0, పీఎం జన్ మన్ పథకాల కింద మొత్తం 18.72 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 13.20 లక్షలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో 16.11 లక్షల ఇళ్లకు గాను 11.31 లక్షలు, ఏపీ టిడ్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గాను 1.88 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

ఉచిత ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కార్యాచరణ
ఇంటి స్థలం లేని అర్హులైన కుటుంబాలను కచ్చితంగా గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆవాస్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖలతో పాటు ఆర్టీజీఎస్ నుంచి డేటాను అనుసంధానం చేసి, డూప్లికేషన్ లేకుండా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రాథమిక జాబితాలు ప్రచురించి, అభ్యంతరాలు స్వీకరించి, పారదర్శకంగా పరిష్కరించిన తర్వాతే తుది జాబితాలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. 

ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని నిర్దేశించారు. కుప్పం నియోజకవర్గంలో సాచురేషన్ విధానంలో గృహ నిర్మాణం చేపట్టాలని ప్రత్యేకంగా ఆదేశించారు.

పారిశ్రామిక టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళిక
రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక టౌన్‌షిప్‌లను నిర్మించే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. శ్రీసిటీ సహా ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. 

2027 డిసెంబరు నాటికి మరో 75 వేల కొత్త గృహాలు మంజూరయ్యేలా, 1.5 లక్షల ఇళ్లను పైప్‌లైన్‌లో ఉంచేలా చూడాలని, ఇందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Housing Schemes
PMAY Gramin Urban AP
Housing For All 2029
Industrial Townships AP
AP Housing Department Review

More Telugu News