అదరగొట్టిన కెప్టెన్ మిలింద్.. ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్లిన ఖమ్మం
- టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై ఖమ్మం ఏసెస్ 5 వికెట్ల తేడాతో గెలుపు
- కెప్టెన్ సీవీ మిలింద్ ఆలౌరౌండ్ ప్రదర్శన
- ప్లే ఆఫ్ ఆశలను మరింత పటిష్టం చేసుకున్న ఖమ్మం ఏసెస్
- 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఖమ్మం
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఖమ్మం బౌలర్లలో కెప్టెన్ మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ సాయి, వేద్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. రైజర్స్ జట్టులో జ్ఞాన ప్రకాశ్ రెడ్డి (25 బంతుల్లో 36), ఆదిత్య జవ్వాజి (37 బంతుల్లో 43) రాణించినప్పటికీ, డెత్ ఓవర్లలో బ్యాటర్లు నెమ్మదిగా ఆడటంతో ఆ జట్టు ఆశించిన స్కోరును సాధించలేకపోయింది.
అనంతరం 148 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఖమ్మం ఏసెస్ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, వైస్ కెప్టెన్ హిమతేజ కొడిమెల (28 బంతుల్లో 45), మికిల్ జైస్వాల్ మధ్య నెలకొన్న 72 పరుగుల భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వర్షం కారణంగా ఆట నిలిచినప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిలింద్ 21 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచి, మరో 17 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఏసెస్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.