సాయికృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ.. కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్

SIT confirms Sai Krishna death as lockup death Krishnalanka CI Nagaraju gets 14 days remand
  • సాయికృష్ణది లాకప్ డెత్ అని తేల్చిన సిట్
  • విజయవాడ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పణ
  • సీసీటీవీ ఫుటేజ్ డిలీట్, మృతదేహం మాయం చేశారని వెల్లడి
  • కృష్ణా లంక సీఐ నాగార్జునకు 14 రోజుల రిమాండ్
  • దర్యాప్తునకు సీఐ సహకరించడం లేదని సిట్ ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తీసుకుంది. ఇది అదృశ్యం కేసు కాదని, పోలీసు కస్టడీలో జరిగిన మరణం (లాకప్ డెత్) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది. మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అక్కడ కస్టడీలో చిత్రహింసల వల్లే అతను మరణించాడని తెలిపింది. తన కొడుకు పోలీస్ స్టేషన్‌లో తీవ్రగాయాలతో, అపస్మారక స్థితిలో కనిపించాడని సాయికృష్ణ తల్లి చెప్పిన విషయాన్ని కూడా సిట్ ప్రస్తావించింది.

లాకప్ డెత్‌ను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సిట్ పేర్కొంది. మే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా, సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని, దాన్ని ఖననం లేదా దహనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ తెలిపింది. ఇప్పటికీ మృతదేహం లభ్యం కాలేదని పేర్కొంది. సీఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నాశనం చేసినట్టు తెలుస్తోందని సిట్ పేర్కొంది.

సీఐ నాగరాజు దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నారని సిట్ ఆరోపించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి, హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. 

కాగా, నిన్న 5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో నాగరాజును జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా, జులై 8 వరకు రిమాండ్‌కు తరలించారు. కేసు చాలా సంక్లిష్టంగా ఉందని, దర్యాప్తునకు మరింత సమయం అవసరమని సిట్ కోర్టుకు విన్నవించింది. కేసు దర్యాప్తు నేపథ్యంలో, పోలీస్ శాఖ ఇప్పటికే సీఐ నాగరాజును విధుల నుంచి సస్పెండ్ చేసింది. 
Go Back to Shorts
CI Nagaraju
Gade Sai Krishna
Krishnalanka Police Station
SIT Investigation Vijayawada
Andhra Pradesh Lockup Death
Police Custodial Death Case

More Telugu News