రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy Slams KTR and Harish Rao Over Telangana Governance
  • రేవంత్ రెడ్డి అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారన్న చామల
  • అధికారంలో ఉన్నన్నాళ్లు సినిమా వాళ్లతో కేటీఆర్ అంటకాగారని విమర్శ
  • ఇప్పుడు కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతుంటే... దాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు భువనగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ఎండగడుతూ విమర్శలు చేశారు.


అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ వంటి విప్లవాత్మక మార్పులతో సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను గాడిలో పెడుతున్నారని చామల ప్రశంసించారు. ఈ డెవలప్‌మెంట్‌ను తట్టుకోలేకే బావ, బావమరిది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి సినిమా వాళ్లతో అంటకాగిన కేటీఆర్... ఇప్పుడు రాజకీయాల్లో కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.


"ప్రజల జీవితాలు కేటీఆర్‌కు సినిమాగా కనిపిస్తున్నాయా? పదేళ్ల మీ పాలన ఏమైనా సూపర్ హిట్టా?" అంటూ ఎంపీ ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల రూలింగ్‌లో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. మీ పాలన ఏమీ ‘షోలే’ సినిమా అంత హిట్ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.


హైదరాబాద్‌ను ముంపు నుంచి కాపాడటంలో ‘హైడ్రా’ కీలక పాత్ర పోషిస్తోందని, నాలాల కబ్జాలను తొలగిస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం హైడ్రా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అలాగే మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పించి అభివృద్ధికి సహకరించాల్సింది పోయి.. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Go Back to Shorts
Chamala Kiran Kumar Reddy
Revanth Reddy Vision
KTR Harish Rao Criticism
Telangana Congress Politics
HYDRA Hyderabad Encroachments
Telangana Development Projects

More Telugu News