ట్రై సిరీస్ ఫైనల్లో సూర్యవంశీ విధ్వంసం.. శ్రీలంక-ఏ ముందు 378 పరుగుల భారీ లక్ష్యం

Vaibhav Suryavanshi carnage in Tri Series Final India A set 378 run target for Sri Lanka A
  • ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక 'ఏ'తో భారత్ 'ఏ' ఢీ
  • సంచనల ఇన్నింగ్స్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ
  • కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు
  • కెప్టెన్ తిలక్ వర్మ, గైక్వాడ్, అనుకూల్ రాయ్ కీలక ఇన్నింగ్స్‌లు
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 377 పరుగులు
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు ‘ఏ’ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (94; 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌తో శ్రీలంక ‘ఏ’ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి మెరుపులకు తోడు కెప్టెన్ తిలక్ వర్మ (67), రుతురాజ్ గైక్వాడ్ (40), అనుకూల్ రాయ్ (39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత ‘ఏ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.

దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ‘ఏ’ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (39)తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా సూర్యవంశీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. అతడి ధాటికి భారత స్కోరుబోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కేవలం 8.5 ఓవర్లకే భారత్ 132 పరుగులు చేసిందంటే సూర్యవంశీ ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. శతకం ఖాయం అనుకున్న దశలో, అతను 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

సూర్యవంశీ సృష్టించిన బలమైన పునాదిపై మిగతా బ్యాటర్లు రాణించారు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా వేగంగా ఆడి ఔటయ్యాక, రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. గైక్వాడ్ నెమ్మదిగా ఆడినా, తిలక్ వర్మ బాధ్యతాయుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఆ తర్వాత కుమార్ కుశాగ్ర (36) వేగంగా ఆడాడు. 

చివర్లో, ఆల్‌రౌండర్ అనుకూల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి స్కోరును 370 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక దశలో 400 పరుగులు దాటేలా కనిపించినా, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 377 పరుగులకు పరిమితమైంది. 

శ్రీలంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, వనుజ సహన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వనుజ సహన్ (2/39), విజయకాంత్ వయస్కాంత్ (0/36) మినహా మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 
Go Back to Shorts
Vaibhav Suryavanshi
India A Sri Lanka A
Tri Series Final
Tilak Varma
Ruturaj Gaikwad
Cricket Scores

More Telugu News