రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Gadikota Srikanth Reddy slams AP government for ignoring farmer suicides
  • రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి
  • ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ
  • వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని, రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం టూరిజం పేరుతో బీచ్‌ల్లో బార్లు పెట్టడంపైనే శ్రద్ధ చూపిస్తోందంటూ మండిపడ్డారు.


అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో ఇవాళ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు తనువు చాలించాల్సి వస్తోందని.. అయినా ప్రభుత్వానికి వారి గురించి మాట్లాడే తీరిక లేదన్నారు.


గత ఏడాది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క అల్లాడిపోయారని... అయినప్పటికీ, ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోలేదని ఆరోపించారు. రాయలసీమను ‘హార్టికల్చర్ హబ్’ చేస్తామని నమ్మించిన చంద్రబాబు... ఇప్పుడు తోతాపురి మామిడి రైతులను కూడా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ రంగానికి రెడ్ కార్పెట్ పరుస్తూ... 65 శాతం ఉన్న వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచుతున్నారని విమర్శించారు.


వైఎస్సార్ హయాంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసి రైతులకు నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ అందించిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం మంచి పనులు చేయడం పక్కనబెట్టి, నిత్యం జగన్ మీద విషం చిమ్మడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ... పోలీసులు సాయికృష్ణని లాకప్‌లో చంపేసి, కనీసం ఆ తల్లికి డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా దాచేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం కులాల ప్రస్తావన తెస్తోందని, నిలదీసిన వారి సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేస్తూ అణచివేతకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Go Back to Shorts
Gadikota Srikanth Reddy
AP Farmer Suicides
YSRCP
Andhra Pradesh Agriculture Crisis
Chandrababu Naidu Government
Sai Krishna Missing Case

More Telugu News