మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి

B Tech Ravi Criticizes YS Jagan Family History
  • హత్యా రాజకీయాల పునాదుల మీదే వైఎస్ కుటుంబం ఎదిగిందని విమర్శలు
  • రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి.. మూడు తరాలుగా ఇదే చరిత్ర అని వెల్లడి
  • పరిటాల రవి, వివేకానంద రెడ్డి హత్యలు జగన్ ప్రమేయం లేకుండా జరగవని వ్యాఖ్యలు
  • సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్‌కు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టీకరణ
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వైసీపీ అధినేత జగన్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబం మూడు తరాలుగా హత్యా రాజకీయాలు చేస్తోందని, వారి రాజకీయ ఎదుగుదల వెనుక ఎన్నో హత్యలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

"ఈ రోజు నేను మీ ముందుకొచ్చింది వైఎస్ కుటుంబం యొక్క అసలు స్వరూపాన్ని, వాళ్ల మూడు తరాల రక్త చరిత్రను ప్రజల ముందు ఉంచడానికి. హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వైఎస్ కుటుంబం గురించి, వాళ్ల రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్న అరాచకాల గురించి మాట్లాడడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను.

వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ల చరిత్ర చూస్తే, ఆనాడు బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా వ్యవహరించి, ఈ దేశానికే అన్యాయం చేసిన చరిత్ర వాళ్లది. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు, వాళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎందరో అమాయకులు హత్యకు గురయ్యారు. వాళ్ల పునాదులే రక్తంతో తడిసినవి. వార్డు మెంబర్ స్థానానికి కూడా ఓడిపోయిన నీచ చరిత్ర వైఎస్ కుటుంబానిది. 1968 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తల్లి వైఎస్ జయమ్మ, గాడిచర్ల కృష్ణమూర్తి అనే సామాన్య వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఇక 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీటర్ కేసు నమోదైంది.

ఆ తర్వాత, రాజారెడ్డి మంగంపేట బైరటీస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర చేరాడు. ఏ పెట్టుబడి లేకుండానే ఆయన వ్యాపారంలో భాగస్వామిగా చేరి, ఆ తర్వాత ఆయన్నే హత్య చేశాడు. ఆ హత్యా రాజకీయ పునాదిపైనే రాజారెడ్డి ఎదిగాడు. ఆ హత్యకు సహకరించిన పౌలిరెడ్డి అనే వ్యక్తి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళి రెడ్డిని హత్య చేశారు. ఆ హత్య తర్వాతే వాళ్లకు కొళ్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడింది. 1989లో చిన్నముడియం గ్రామంలో రిగ్గింగ్ చేయడానికి వెళితే, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ కక్షతో శివారెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. శివారెడ్డి మరణం తర్వాతే వైఎస్ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగింది.

ఈ రోజు శాంతి ప్రవచనాలు చెబుతున్న జగన్ రెడ్డి, పులివెందులలో పేర్ల పార్థసారథి రెడ్డికి సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో రాజారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసినందుకు పార్థసారథి రెడ్డిపై హత్యాయత్నం చేశారు. కత్తులతో నరికినా ఆయన బతికి బట్టకట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజారెడ్డి, ఆయన సోదరుడు ఉమా రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి ముద్దాయిలుగా ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్థసారథి రెడ్డి వర్గీయులను జైల్లో పెట్టి, పెరోల్ కూడా రాకుండా చేసి కుటుంబాలకు దూరం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్లను తామేమీ చేయలేదని మాట్లాడటం సిగ్గుచేటు.

ఇక రాజారెడ్డి వారసుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. లింగాల మండలంలో పెద్దగూడెం కృష్ణారెడ్డిని హత్య చేయించారు. ఆ సమయంలో తాను హైదరాబాద్‌లో ఓ మిలటరీ అధికారితో గొడవపడినట్టు నాటకమాడి, ముందుగా సిద్ధం చేసుకున్న ముద్దాయిలను పోలీసులకు లొంగిపోయేలా చేసి కేసు నుంచి తప్పించుకున్నారు. రిగ్గింగ్ కోసం డైనమైట్లు పెట్టి భయానక వాతావరణం సృష్టించారు. ఆ తర్వాత రఘురామిరెడ్డి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న విలేకరి నారాయణ, నంద్యాల శివరామిరెడ్డిని హత్య చేయించారు. ఈ హత్యలతో పులివెందుల టౌన్ మొత్తం వైఎస్ కుటుంబానికి భయంతో లొంగిపోయింది.

ఇక జగన్ విషయానికొస్తే, మాకు తెలిసిన జగన్ వేరు, బయట ప్రపంచానికి తెలిసిన జగన్ వేరు. ఆయన మనస్తత్వం చాలా క్రిమినల్ మైండ్‌సెట్. బెంగళూరులో ఉంటూనే ఎరుకల మహేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించారు. ఆ తర్వాత మహేష్ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల ఉదయ్, 20 ఏళ్ల సాకి రామాంజనేయులును కూడా హత్య చేయించారు. మద్యంలో మత్తు మందు కలిపి పక్కా ప్లాన్‌తో ఈ హత్యలు జరిగాయి. ఆ కేసు తన మెడకు చుట్టుకుంటుందని భయపడి జగన్ ఢిల్లీ పారిపోయాడు. ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి, వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉండి చనిపోయిన కోవిడ్ గంగాధర్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీని వీడి రానందుకే పరిటాల రవిని హత్య చేయించారు. జగన్ ప్రమేయం లేకుండా పరిటాల రవి హత్య జరగదు. అలాగే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా జగన్‌కు తెలియకుండా జరగదు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న అవినాశ్ రెడ్డిని, వాళ్ల కుటుంబాన్ని జగన్ ఏనాడైనా వారించారా?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డికి వాళ్ల నాన్న మరణం గుర్తుకొస్తుంది. వైఎస్ మరణంలో రిలయన్స్ పాత్ర ఉందని చెప్పి, వాళ్ల ఆస్తులపై దాడులు చేయించి, 2020లో అదే రిలయన్స్ కుటుంబానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటిచ్చిన ఘనత జగన్‌ది.

చంద్రబాబు గారిని వెన్నుపోటుదారుడు అంటున్నాడు. 1996లో ప్రజలు ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి, మరి ఎందుకు ఓడిపోయారు? చంద్రబాబు వెన్నుపోటుదారుడు అయితే ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇజ్రాయెల్‌లో తల్లి విజయమ్మ సమక్షంలో చెల్లి షర్మిలకు ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఆమెతో పాదయాత్ర చేయించుకుని రాజకీయ లబ్ధి పొంది, చివరకు తల్లిని, చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. ఇది కాదా వెన్నుపోటు? సొంత చెల్లికి న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర జగన్‌ది.

చివరగా ఒక్కటే అడుగుతున్నా. వైఎస్సార్ కుటుంబానికి నమ్మకంగా ఉన్న సతీష్ రెడ్డిపై హ్యాండ్ గ్రెనేడ్ వేసి హత్యకు పథకం రచించింది నిజం కాదా? ఈ విషయంపై సతీష్ రెడ్డే బహిరంగంగా సమాధానం చెప్పాలి. ఇదీ వైఎస్ కుటుంబం యొక్క మూడు తరాల రక్త చరిత్ర. ఇలాంటి వాళ్లు ఇతరుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది" అని బీటెక్ రవి ఘాటుగా వ్యాఖ్యానించారు. 
Advertisement
B Tech Ravi
YS Jagan
YS family
TDP
Andhra Pradesh politics
murder allegations
faction politics
political history
controversy
Telugu Desam Party

More Telugu News