30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు

Bhumana Karunakar Reddy Brings Couple Back to Hinduism
  • తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు
  • 30 ఏళ్ల క్రితం కువైట్‌లో ఇస్లాం స్వీకరించిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు
  • బాల్య స్నేహితుడైన భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి రాక
  • జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని భూమన విమర్శ
  • తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెరవేరిందని సంతృప్తి
తిరుపతిలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ‘హిందూమత పున:స్వీకరణ మహోత్సవం’ జరిగింది. 30 ఏళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించిన ఓ జంట, భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. ఈ సందర్భంగా భూమన తన నివాసంలో ప్రత్యేక హోమం నిర్వహించి వారిని హిందూ మతంలోకి ఆహ్వానించారు.

అసలేం జరిగిందంటే..!
తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా వారు ఇస్లాం మతం స్వీకరించి, తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్చుకున్నారు. ఐదేళ్ల క్రితం తిరిగి స్వస్థలానికి వచ్చిన వీరు తిరుపతిలోని పీకే లేఅవుట్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చిన్ననాటి స్నేహితులు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ తిరుపతిలో కలుసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడు మతం మారాడని తెలుసుకున్న భూమన, తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడంతో శ్రీనివాసులు రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయాన్ని భూమనకు తెలుపగా, ఆయన తన పద్మావతిపురంలోని నివాసంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. "కువైట్‌లో పరిస్థితుల వల్ల ఇస్లాం స్వీకరించాల్సి వచ్చింది. నా బాల్య స్నేహితుడు భూమన రెండేళ్లుగా తిరిగి హిందూ మతంలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన ప్రోత్సాహంతో ఇప్పుడు మనస్ఫూర్తిగా సొంత మతంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై సగర్వంగా తిరుపతి కొండకు వెళ‌తాను" అని తెలిపారు.

ఈ కార్యక్రమం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, శ్రీనివాసులు రెడ్డి 50 ఏళ్లుగా స్నేహితులమని చెప్పారు. "గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆదేశాలతో 60 మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించాం. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని ఆ సదస్సులో తీర్మానించాం. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ప్రభుత్వం ఆ పని చేయకపోయినా, జగన్ ఆశయానికి అనుగుణంగా నా స్నేహితుడిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చింది" అని భూమన వ్యాఖ్యానించారు. 
Advertisement
Bhumana Karunakar Reddy
Hinduism
religious conversion
reconversion
Tirupati
YS Jagan
Andhra Pradesh
Hindu Dharma
Sri Venkateswara Temple

More Telugu News