YS Jagan: అమరావతిపై చంద్రబాబుది డ్రామా.. ఇదే మా ప్లాన్ బీ: జగన్

YS Jagan on Chandrababus Amaravati Drama Reveals Plan B
షార్ట్స్‌లో చూడండి
అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా 'ప్లాన్ బి' పేరుతో 'మావిగన్' (MAVIGAN) అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ఏమిటీ 'మావిగన్' ప్లాన్?

జగన్ వివరించిన 'మావిగన్' ప్రణాళిక ప్రకారం, మచిలీపట్నం నుంచి విజయవాడ (70 కి.మీ.), విజయవాడ నుంచి గుంటూరు (40 కి.మీ.) వరకు విస్తరించి ఉన్న 110 కిలోమీటర్ల కారిడార్‌ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 35-40 లక్షల జనాభా నివసిస్తోందని, జాతీయ రహదారి వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. అమరావతికి ప్రతిపాదించిన రూ.2 లక్షల కోట్లలో కేవలం 10% నిధులు, అంటే రూ.20,000 కోట్లతో ఈ ప్రాంతంలో రింగ్ రోడ్లు, ఇతర అనుసంధాన మార్గాలు ఏర్పాటు చేస్తే, ఇది సహజంగానే ఒక మెగాసిటీగా, అభివృద్ధి కేంద్రంగా మారుతుందని ఆయన వివరించారు. తన హయాంలో మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించామని, దానివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో అవినీతికి ఆస్కారం తక్కువ కాబట్టే, ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రణాళికను పక్కన పెట్టిందని ఆరోపించారు.

అమరావతి.. అవినీతి రాజధాని

అమరావతిని 'అవినీతి రాజధాని'గా జగన్ అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి, బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారం, అమరావతిలో కేవలం రోడ్లు, కరెంట్, డ్రైనేజీ వంటి కనీస వసతులకే ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ లెక్కన 50,000 ఎకరాలకు రూ.1 లక్ష కోట్లు, లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది రాష్ట్రాన్ని దివాళా తీయించడానికేనని విమర్శించారు. చంద్రబాబు తన గత, ప్రస్తుత పాలనలో కలిపి ఏడేళ్లలో కేవలం రూ.8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ వేగంతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు.

నిర్మాణ వ్యయాల్లో భారీ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐదు నక్షత్రాల సౌకర్యాలతో ఫ్లాట్ నిర్మించడానికి చదరపు అడుగుకు రూ.4,500 ఖర్చయితే, అమరావతిలో రూ.11,000 నుంచి రూ.14,000 వరకు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, భూమి, జీఎస్టీ మినహాయింపులు ఇస్తున్నా ఇంత భారీ వ్యయం ఎందుకని నిలదీశారు. టవర్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల వ్యయాన్ని ఇతర నగరాలతో పోల్చి, భారీ వ్యత్యాసాలను ఎత్తిచూపారు. అమరావతిలో కిలోమీటర్ ఫ్లైఓవర్‌కు రూ.170 కోట్లు చూపిస్తుంటే, తన హయాంలో విజయవాడ బెంజ్ సర్కిల్‌లో కేవలం రూ.35 కోట్లతో పూర్తి చేశామన్నారు. ఢిల్లీలోని కొత్త పార్లమెంట్, తెలంగాణ సచివాలయం కన్నా ఏపీ అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణ వ్యయాలు ఎక్కువగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయని, వారు అమరావతికి కేవలం షటిల్ సర్వీస్ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘకాలం పాలనలో ఉన్న చంద్రబాబు అమరావతికి ఏం చేశారని, రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అమరావతిపై తీర్మానం పేరుతో అసెంబ్లీలో చంద్రబాబు కొత్త డ్రామా ఆడారని, సభను కేవలం తనను, వైసీపీని దూషించడానికి వాడుకున్నారని విమర్శించారు.

అమరావతిపై ఉన్న శ్రద్ధ వల్ల విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలన్నదే తమ విధానమని పునరుద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులను శిక్షిస్తామని జగన్ హెచ్చరించారు.
Go Back to Shorts
YS Jagan
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Capital Area Corridor
MA-VI-GUN
Machilipatnam
Vijayawada
Guntur

More Telugu News