West Indies Cricket Team: టీ20 ప్రపంచకప్: 9 రోజుల నిరీక్షణకు తెర.. భారత్ నుంచి బయల్దేరిన విండీస్ జట్టు

West Indies Cricket Team Departs India After T20 World Cup Delay
  • ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో మూతపడిన గగనతలం
  • భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు
  • విఫలమైన ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాట్లు
  • సొంతంగా వాణిజ్య విమానాలు బుక్ చేసిన విండీస్ బోర్డు
టీ20 ప్రపంచకప్ అనంతరం భారత్‌లో చిక్కుకుపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. దాదాపు తొమ్మిది రోజుల నిరీక్షణ తర్వాత ఆటగాళ్ల కోసం వాణిజ్య విమానాల్లో టికెట్లు ఏర్పాటు చేసినట్లు క్రికెట్ వెస్టిండీస్ (CWI) తెలిపింది.

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆ మార్గంలోని గగనతలాన్ని మూసివేశారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టర్ విమానం రాక ఆలస్యమైంది. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇకపై చార్టర్ విమానం కోసం వేచి చూడటం సరికాదని నిర్ణయించుకున్నట్లు వెస్టిండీస్ బోర్డు తెలిపింది. ఐసీసీ సమన్వయంతో తామే సొంతంగా వాణిజ్య విమానాల్లో ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.

ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు, సిబ్బంది భారత్ నుంచి బయల్దేరారని, మిగిలిన వారు ఈరోజు స్వదేశానికి పయనమవుతారని తెలిపింది. వెస్టిండీస్ జట్టుతో పాటు జింబాబ్వే జట్టు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. మార్చి 1న దక్షిణాఫ్రికాతో తమ చివరి మ్యాచ్ ఆడిన జింబాబ్వే ఆటగాళ్లు కూడా భారత్‌లోనే ఉండిపోయారు. అయితే, వారి కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని, ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా మీదుగా వారిని స్వదేశానికి పంపినట్లు ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.
West Indies Cricket Team
T20 World Cup
Cricket West Indies
CWI
India
Zimbabwe Cricket
ICC
Flight Delay
Israel Iran Tension
Commercial Flights

More Telugu News