Bill Gates: నేడు ఏపీకి బిల్ గేట్స్.. చంద్రబాబు, పవన్‌తో కీలక భేటీ

Bill Gates Visits Andhra Pradesh Meets Chandrababu Pawan
  • ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్
  • విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చ
  • ఆర్టీజీఎస్ కేంద్రం, వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనున్న బృందం
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశం కానున్నారు. విద్య, వైద్య, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

బిల్ గేట్స్‌తో పాటు ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. సచివాలయంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) కేంద్రాన్ని వారు సందర్శిస్తారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగం, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు వివరించనున్నారు. అనంతరం 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యాలు, వివిధ రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

ఈ సమావేశంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో నడుస్తున్న 'సంజీవని' ప్రాజెక్టు పురోగతిని ప్రభుత్వం వివరించనుంది. అనంతరం, ఉండవల్లి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శిస్తుంది. అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సాయంతో చేపడుతున్న ఆధునిక సాగు విధానాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Bill Gates
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Gates Foundation
Amaravati
Agriculture
Education
Healthcare
AP Government

More Telugu News