Team India: టీ20 వరల్డ్ కప్: పసికూన నమీబియాను కుమ్మేసిన టీమిండియా

Team India Crushes Namibia in T20 World Cup
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమగ్ర ప్రదర్శన కనబరిచిన భారత్, ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది.

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నమీబియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ గ్రూప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి సంజూ శాంసన్ (8 బంతుల్లో 22) కూడా తోడవడంతో పవర్‌ప్లేలోనే భారత్ స్కోరు పరుగులు పెట్టింది. మధ్యలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నెమ్మదిగా ఆడినా, చివర్లో హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

ఈ టోర్నీలో భారత్ కు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో భారత జట్టు అమెరికాపై నెగ్గడం తెలిసిందే. ఇక, తదుపరి మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ ఈ నెల 15న తలపడనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి రాజకీయ పరిణామాలతో ఈ పోరుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 
Go Back to Shorts
Team India
T20 World Cup
India vs Namibia
Ishan Kishan
Hardik Pandya
Varun Chakravarthy
Arun Jaitley Stadium
Cricket
Namibia
T20

More Telugu News