'అఖండ 2' విడుదలకు ఊహించని అడ్డంకి.. చివరి నిమిషంలో నిర్మాతలకు షాక్!
- నిర్మాతలపై పిటిషన్ దాఖలు చేసిన బాలీవుడ్ సంస్థ ఈరోస్
- రూ. 28 కోట్ల పాత బకాయిల వివాదమే ప్రధాన కారణం
- 'వన్ నేనొక్కడినే' సినిమా నష్టాలకు సంబంధించిన కేసు
- స్టే విధిస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు
- కోర్టు బయట సెటిల్‌మెంట్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం
పూర్తి వివరాల్లోకి వెళితే... 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో మహేశ్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాల నిర్మాణ సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేశాయి. ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది.
'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది.
ఇవాళ పెయిడ్ ప్రీమియర్లతో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నిర్మాతలకు ఈ తీర్పు పిడుగుపాటు అయింది. అయితే, ఈ వివాదం కోర్టు బయట సెటిల్‌మెంట్ ద్వారా త్వరగా పరిష్కారమవుతుందని, సినిమా విడుదలకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.