ఆ స్టంట్ చేయొద్దని రాజును హెచ్చరించారు... కానీ అతడు వినలేదు: హీరో విశాల్
- సెట్ లో స్టంట్ చేస్తూ మృతి చెందిన స్టంట్ మేన్ రాజు
- కోలీవుడ్ లో తీవ్ర విషాదం
- స్పందించిన విశాల్
"రాజు నాకు గత 20 ఏళ్లుగా తెలుసు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది" అని భావోద్వేగంతో చెప్పారు విశాల్. "అతని కుటుంబానికి సహాయం చేయడం నా బాధ్యత. రాజుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారికి మేము ఎలాంటి సహాయం చేయగలమో ఆలోచిస్తున్నాం" అని తెలిపారు.
"ఈ స్టంట్ సన్నివేశం ఒక పెద్ద యాక్షన్ బ్లాక్‌లో భాగంగా ఉంది, ఇందులో కారు బోల్తా కొట్టే స్టంట్ ఉంది. ఈ స్టంట్‌కు కచ్చితమైన లెక్కలు, భద్రతా జాగ్రత్తలు అవసరం. అయితే, ఈ స్టంట్ చేయవద్దని రాజుకు స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ సూచించారు. ఇది సాధారణ స్టంట్ కాదని, తాను కానన్ బ్లాస్ట్‌తో స్టంట్‌ను పూర్తి చేస్తానని దిలీప్ చెప్పారు. కానీ రాజు వినలేదు. తానే స్వయంగా ఆ స్టంట్ చేస్తానని పట్టుబట్టాడు" అని విశాల్ వివరించారు.
స్టంట్ తర్వాత రాజు ఒంటిపై గాయాలు కనిపించలేదని, కానీ అతనిలో చలనం లేదని విశాల్ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ అతన్ని మృతుడిగా ప్రకటించారని వివరించారు.