హ‌ద్దులు దాటిన అభిమానం.. ఆర్‌సీబీ గెలుపుతో విజ‌య‌వాడ‌లో వీరంగం.. యువ‌కుడి మృతి

RCB Victory Celebration Turns Tragic Vijayawada Youth Dies
  • విజ‌య‌వాడ‌లో విజ‌యోత్స‌వ ర్యాలీలో అప‌శ్రుతి
  • ర్యాలీలో పాల్గొన్న యువ‌కుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి
  • ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సుల‌పైకి ఎక్కి హంగామా చేసిన యువ‌కులు
  • యువ‌కుల తీరుప‌ట్ల న‌గ‌ర వాసుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు
విజ‌య‌వాడ‌లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నిర్వ‌హించిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) క్రికెట్ జ‌ట్టు విజ‌యోత్స‌వంలో అప‌శ్రుతి చోటుచేసుకుంది. విజ‌యోత్స‌వ ర్యాలీలో పాల్గొన్న యువ‌కుడు రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... స్థానిక వించిపేట‌కు చెందిన తాడిగిరి శేఖ‌ర్ (30) అనే యువ‌కుడు రైల్వే పార్శిల్ కార్యాల‌యంలో ప‌ని చేస్తున్నాడు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ఆర్‌సీబీ గెలిచింద‌ని త‌న మిత్రులు శ్రీనాథ్‌, ఉద‌య్ కుమార్‌ల‌తో క‌లిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నాడు. 12.15 గంట‌ల స‌మ‌యంలో బందరు రోడ్డులోని చైత‌న్య కాలేజీ వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తున్న బైక్ అదుపుత‌ప్పండంతో ముగ్గురూ కింద ప‌డ్డారు. 

అదే స‌మ‌యంలో వెనుక నుంచి వ‌స్తున్న కారు శేఖ‌ర్‌ పైనుంచి వెళ్ల‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దాంతో స్నేహితులు అత‌డిని హూటాహూటిన ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ అర్ధ‌రాత్రి ఒంటిగంట స‌మయంలో చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ ప్రకాశ్ తెలిపారు. 

సంబ‌రాల్లో హ‌ద్దులు దాటిన ఫ్యాన్స్
ఆర్‌సీబీ గెలిచింద‌న్న సంబ‌రాల్లో అభిమానులు హ‌ద్దులు దాటారు. వీరంగం సృష్టించారు. డివైడ‌ర్ మ‌ధ్య‌లో మొక్క‌లు పీకేశారు. బారికేడ్ల‌ను బైక్‌ల‌కు క‌ట్టి లాక్కెళ్లారు. ఆ స‌మ‌యంలో అటుగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సుల‌పైకి యాభై మందికిపైగా ఎక్కి హ‌డావుడి చేశారు. బ‌స్సుపైకి ఎక్కి హంగామా చేయ‌డంతో లోప‌ల ఉన్న ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. యువ‌కుల తీరుప‌ట్ల న‌గ‌ర వాసుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అభిమానులు వీరంగం సృష్టించిన వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.   
Go Back to Shorts
Vijayawada
RCB
Royal Challengers Bangalore
Road Accident
Cricket Fans
Celebration Rally
Andhra Pradesh
IPL
Cricket

More Telugu News