తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Rains Orange Alert Issued for Several Districts
ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇదిలావుండగా, నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, అలాగే దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. రుతుపవనాల కదలిక ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల సమూహంలో భారీ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ విభాగం తెలియజేసింది.
Go Back to Shorts
Telangana
Thunderstorms
Rain
Orange Alert
Weather Forecast
India Meteorological Department
IMD

More Telugu News