నేను మంత్రి పదవి అడిగితే ఇదెక్కడి న్యాయం అన్నారు: చంద్రబాబు
- మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని రచించిన డాక్టర్ శరణి
- విజయవాడలో పుస్తకావిష్కరణ
- తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన వెల్లడించిన చంద్రబాబు
తాను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే రాజకీయ నాయకుడు కావాలని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు. అనేక మంది తనకు ఐఏఎస్ వంటి ఉద్యోగాలను సూచించినా, తాను మాత్రం ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పారు. "మా వైస్ ఛాన్సలర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తానన్నా వద్దన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, గెలిచి వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాను. అన్నట్టుగానే గెలిచాను," అని చంద్రబాబు వివరించారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలనే సంకల్పం కలిగిందని, ఈ విషయంపై అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని కలిశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "నాకు మంత్రి పదవి ఇవ్వాలని మా వాళ్లు చెన్నారెడ్డి గారిని అడిగారు. అప్పుడు ఆయన నన్ను పైకీ కిందకీ చూశారు. నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ వి, ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే మంత్రి అయిపోవాలనుకుంటున్నావా? ఇది ఎక్కడ న్యాయం? అని అన్నారు," అని చంద్రబాబు నాటి సంభాషణను వివరించారు.
అయితే, తాను వెనక్కి తగ్గలేదని, "నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి. నేను ఎంఏ చదువుకున్నాను, పీహెచ్‌డీ కూడా చేస్తాను అని చెప్పి వచ్చాను," అని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లలోనే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో తాను మంత్రి అయ్యానని గుర్తు చేసుకున్నారు. తనకు మొదట ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్ వంటి శాఖలు కేటాయించారని, వాటికి జిల్లాల్లో సరైన ఆఫీసులు కూడా లేవని అన్నారు. అయినా దానిని సవాలుగా తీసుకుని పనిచేశానని, ఆ క్రమంలోనే ఎన్టీ రామారావు గారితో పరిచయం ఏర్పడిందని చంద్రబాబు వెల్లడించారు.
ఈ సందర్భంగా నటుడు చిరంజీవి గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. "చిరంజీవి గారికి నటుడు కావాలనే బలమైన సంకల్పం ఉండేది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక, చిరంజీవి గారు సినీ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అది ఒక అవకాశం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టుదల, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే తత్వం విజయానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.