మా ఇంట్లో ఉండే కోడిపెట్ట పారిపోయింది: చిరంజీవి

Chiranjeevi talks about MM Keeravani music concert
  • మార్చి 22న కీరవాణి సంగీత కచేరి
  • హైదరాబాద్ హైటెక్స్ లో కార్యక్రమం 
  • చిరంజీవి ఆసక్తికర వీడియో
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మార్చి 22న హైదరాబాదులో సంగీతకచేరీ నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రోమో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కీరవాణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియో ఆరంభంలో చిరంజీవి ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తారు. 

అనంతరం చిరు ఏమన్నారంటే..."హాయ్... ఏంటి వెతుకుతున్నానని అనుకుంటున్నారా...? మా ఇంట్లో ఒక కోడిపెట్ట ఉందండీ... అది పారిపోయింది. మామూలు కోడిపెట్ట కాదు... బంగారు కోడిపెట్ట. దానికోసం దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చాను. ఎక్కడైనా బంగారు కోడిపెట్ట ఉంటుందా అని వాళ్లు ఎగతాళిగా నవ్వుతున్నారు. వాళ్లు నమ్మడంలేదు.

కానీ, మార్చి 22న సాయంత్రం హైదరాబాదులో కీరవాణి ఆధ్వర్యంలో ఒక సంగీత కచేరి జరగబోతోంది... బంగారు కోడిపెట్ట అక్కడ కచ్చితంగా ఉంటుందని చెప్పారు. నాకూ నమ్మకమే... ఆ బంగారు కోడిపెట్టను పట్టుకోవడానికి కొంతమందిని పంపిస్తాను. మీరు కూడా అక్కడికి వెళ్లండి... నా బంగారు కోడిపెట్టను పట్టుకోండి... వాటేసుకోండి... తీసుకొచ్చేసేయండి" అని వివరించారు. 

ఇక, ఈ వీడియోపై కీరవాణి స్పందిస్తూ, బంగారు కోడిపెట్ట సాంగ్ కు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. "చిరంజీవి గారూ... మీ మాటలతో మళ్లీ ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. అందరూ సిద్ధంగా ఉండండి... మీ కోసం బంగారు కోడిపెట్టను తీసుకువస్తున్నాను... మార్చి 22న హైదరాబాదులోని హైటెక్స్ లో కలుసుకుందాం" అని తెలిపారు. 

చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ఘరానా మొగుడు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గానూ అలరించింది. ఇందులోని బంగారు కోడిపెట్ట సాంగ్ ఉర్రూతలూగించింది. ఇప్పుడీ సాంగ్ గురించే చిరంజీవి, కీరవాణి మాట్లాడారు.
Go Back to Shorts
Chiranjeevi
Bangaru Kodipetta
MM Keeravani
Music Concert
Hyderabad

More Telugu News