Tanush Kotian: అశ్విన్ స్థానంలో యువ ఆట‌గాడు త‌నుశ్ కోటియన్‌.. బీసీసీఐ అనూహ్య నిర్ణ‌యం!

Tanush Kotian to join Indias Test squad as Ravichandran Ashwin Replacement
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవ‌ల అనూహ్యంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌ధ్య‌లో ఇలా ఈ ఆఫ్ స్పిన్న‌ర్ త‌న షాకింగ్ నిర్ణ‌యంతో అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచాడు. అయితే, తాజాగా బీసీసీఐ అశ్విన్ స్థానంలో యువ ఆట‌గాడు, స్పిన్ ఆల్‌రౌండ‌ర్ త‌నుశ్ కోటియ‌న్‌ను అనూహ్యంగా ఎంపిక చేసింది. 

ప్ర‌స్తుతం అత‌ను ముంబై త‌ర‌ఫున‌ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ముంబ‌యి జట్టులో భాగంగా అతను ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్నాడు. మంగ‌ళ‌వారం మెల్‌బోర్న్ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇక బీజీటీ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం జట్టులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలకు బ్యాకప్‌గా కోటియన్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, 26 ఏళ్ల త‌నుశ్‌ కోటియన్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. అలాగే 47 ఇన్నింగ్స్‌లలో 41.21 సగటుతో రెండు సెంచరీలు, 13 అర్ధసెంచరీలతో 1,525 పరుగులు చేశాడు. అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్య‌టించిన‌ ఇండియా-ఏ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ ప‌ర్య‌ట‌న‌లో ఒక మ్యాచ్ కూడా ఆడాడు. అందులో 44 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.

అటు ముంబ‌యి జ‌ట్టు 2023-24 రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో టైటిల్ గెల‌వ‌డంలో కోటియ‌న్ కీల‌క‌ పాత్ర పోషించాడు. సీజ‌న్ మొత్తంలో 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. అలాగే 16.96 సగటుతో 29 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇలా అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్ షోతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. లిస్ట్‌-ఏ, టీ20ల్లోనూ మంచి గ‌ణాంకాలను క‌లిగి ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే కోటియ‌న్ కు అనూహ్యంగా టీమిండియా టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, తనుశ్‌ కోటియన్
Go Back to Shorts
Tanush Kotian
Ravichandran Ashwin
Team India
Cricket
Sports News

More Telugu News