సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పూసుగూడెంలో ప్రాజెక్ట్ రెండో పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం
- సీతారామ ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
- తన రాజకీయ జీవిత కల నెరవేరిందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నా కల నెరవేరింది: తుమ్మల
సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో తన రాజకీయ కల నెరవేరిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పంప్ హౌజ్ మోటర్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బిజీ షెడ్యూల్‌లోను ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం వచ్చారన్నారు.
రైతు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాములవారి పాదాల వద్ద ప్రకటన చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఇవాళ సగర్వంగా వైరా సభ నిర్వహిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ నీళ్ళు రాని పక్షంలో గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
తక్కువ సమయంలో 70 రోజుల్లో వైరా లింక్ కెనాల్ పూర్తి చేశామన్నారు. తమ ప్రభుత్వం నీరు అందించి సాగుకు దన్నుగా నిలుస్తోందన్నారు. అలాగే రుణమాఫీ చేసి రైతన్నల పక్షమని నిరూపించుకున్నామన్నారు. మిగిలిన సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు.