వేలంలో భారీ ధర పలికిన నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పిస్తోళ్లు

వేలంలో భారీ ధర పలికిన నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన పిస్తోళ్లు

Pistols With Which Napoleon Intended To Kill Himself Sold For huge price In France
  • సుమారు రూ.15 కోట్లు పలికిన రెండు పిస్తోళ్లు
  • పారిస్ లో వేలం నిర్వహణ
  • ఈ పిస్తోళ్లకు ఆసక్తికర చరిత్ర
ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు, రాజకీయ నాయకుడు ‘నెపోలియన్ బోనపార్టే’.. ఒకప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లను ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు ($1.8 మిలియన్) విక్రయించినట్లు వేలం నిర్వహణ సంస్థ ‘ఒసేనాట్ ఆక్షన్’ తెలిపింది. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది. పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలో వేలాన్ని ఆదివారం నిర్వహించారు.

కాగా ఈ పిస్తోళ్లను వేలం వేయడానికి ముందు రోజు వీటిని దేశ సంపదగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వస్తువులను జాతీయ సంపదగా వర్గీకరించామని, వాటి విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. సదరు వ్యక్తి నుంచి దక్కించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. కాగా దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే ఫ్రాన్స్ వెలుపలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆ దేశ నిబంధనలు చెబుతున్నాయి. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

కాగా ఈ రెండు పిస్తోళ్లను బంగారం, వెండితో తయారు చేశారు. ఈ రెండు తుపాకులు సామ్రాజ్య వైభవంతో కనిపిస్తున్నాయి. కాగా 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకోవడంతో నెపోలియన్ అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశ, ఒత్తిడికి లోనైన ఆయన ఈ తుపాకీలతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించారని వేలం సంస్థ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ వెల్లడించారు. తుపాకీ పనిచేయకపోవడంతో నెపోలియన్ విషం తాగారని, అయితే వాంతి కావడంతో ప్రాణాలతో బయటపడ్డారని, తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారని వివరించారు.
Advertisement
Napoleon
Pistols Auction
France

More Telugu News