థర్డ్ అంపైర్ నిర్ణయంపై సంజూ శాంసన్ అసంతృప్తి.. భారీ జరిమానా విధింపు
- మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం
- ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడన్న బీసీసీఐ
- వివాదాస్పదంగా మారిన ఢిల్లీ ఆటగాడు షాయ్ హోప్ అందుకున్న క్యాచ్
మూడు నాలుగు కెమెరా యాంగిల్స్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్.. సంజూ శాంసన్ ఔట్‌గా తేల్చారు. ఈ నిర్ణయం పట్ల సంజూ శాంసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్ల వద్దకు వెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విధంగా వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం సంజూ శాంసన్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని, మ్యాచ్ రిఫరీ ముందు నేరాన్ని అంగీకరించాడని బీసీసీఐ ప్రకటన పేర్కొంది. లెవల్ 1 ఉల్లంఘనలకు సంబంధించి మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది.
కాగా సంజూ శాంసన్ ఔటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.