ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
- పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్
- బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు
- కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల
ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు..
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధి, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ నుంచి చైన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వంటి ఎన్నో హామీలు ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. వీటిలో ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ హామీల్లో కొన్నింటిని నెరవేర్చినా... ఏపీకి వీళ్లు ఎంతో కొంత చేస్తున్నారని అనుకునేవాళ్లమని చెప్పారు.
రాష్ట్ర పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని షర్మిల మండిపడ్డారు. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఏపీని మోసం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఎందుకు మద్దతుగా ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని మండిపడ్డారు. ఈరోజు ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.
మా పోరాటం ఆగదు..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలిశామని... రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసాలపై వివిధ పార్టీల అధినేతలకు కూడా లేఖలు రాస్తామని షర్మిల చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లకు కూడా లేఖలు రాస్తామని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుందనే ఆశావాదంతో తాము ఉన్నామని చెప్పారు. విభజన హామీలను సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.