బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని.. బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసిన సినీ నటుడు వెంకటేశ్

Victory Venkatesh visits Bezawada Durgamma
  • అమ్మవారిని దర్శించుకున్న సైంధవ్ చిత్రబృందం
  • వెంకీని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
  • బాబాయ్ హోటల్ వద్ద వెంకటేశ్‌తో సెల్ఫీలు 
  • సంక్రాంతి కానుకగా వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు ‘సైంధవ్’
టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్‌కు రావడంతో సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటెత్తారు. ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. 

వెంకటేశ్ నటించిన పాన్ ఇండియా మూవీ సైంధవ్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అందులో భాగంగా నటుడు వెంకటేశ్‌తోపాటు దర్శకుడు, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సినిమా విజయవంతం కావాలని ప్రార్థించారు.

ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్‌ వస్తున్న విషయం తెలియడంతో అభిమానులు ఆలయానికి చేరుకుని ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. 

యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న సైంధవ్ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఇది జనవరి 13న విడుదల కానుంది. సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Go Back to Shorts
Venkatesh Daggubati
Saindhav
Vijayawada
Goddess Durgamma
Babai Hotel

More Telugu News