బర్రెలక్క సోదరుడిపై దాడిని ఖండించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి బర్రెలక్క
- ప్రచారంలో ఉండగా బర్రెలక్క, ఆమె సోదరుడిపై దుండగుల దాడి
- ఆమెకు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని డీజీపీ, ఈసీని కోరిన సీబీఐ మాజీ జేడీ
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష నిన్న ఇంటింటి ప్రచారంలో ఉండగా కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడి చేశారు. వీరి దాడిలో శిరీష సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రచారానికి లభిస్తున్న మద్దతును చూసి ఓర్వలేని వారే ఇలా దాడులకు పాల్పడున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిరీష, ఆమె సోదరుడిపై జరిగిన దాడి ఘటనపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. దాడిని ఖండిస్తున్నట్టు పేర్కొంటూ ఎక్స్ చేశారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ, ఎన్నికల కమిషన్, సీఈవో తెలంగాణను ట్యాగ్ చేశారు.