చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తాం: నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
- తీవ్ర అనారోగ్యంతో నటుడు చంద్రమోహన్ కన్నుమూత
- విషాదంలో మునిగిపోయిన చిత్రసీమ
- చంద్రమోహన్ తనకు మేనమామ అవుతారని వెల్లడించిన నిర్మాత శివలెంక
- చంద్రమోహన్ కుమార్తెలు వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడి
చంద్రమోహన్ మృతిపై ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ స్పందించారు. చంద్రమోహన్ తనకు స్వయానా మేనమామ అని తెలిపారు. ఆయన గత నాలుగేళ్లుగా హృదయ సంబంధ సమస్యతో బాధపడుతున్నారని, కిడ్నీ సమస్య కూడా రావడంతో ఆయన కోలుకోలేకపోయారని కృష్ణప్రసాద్ వివరించారు.
ఇవాళ ఉదయం ఉన్నట్టుండి పడిపోయారని, అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూశారని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నాడు నిర్వహిస్తామని తెలిపారు. చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒకరు చెన్నైలో, మరొకరు అమెరికాలో ఉన్నారని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
కాగా చంద్రమోహన్ కు 2006లో బైపాస్ సర్జరీ జరిగింది. తర్వాత కాలంలో ఆయన క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన చివరి చిత్రం గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్. ఈ చిత్రం తర్వాత సినిమాలకు పూర్తిగా వీడ్కోలు పలికారు.