KCR: నిర్మల్ సభలో బీజేపీ ప్రస్తావన తీసుకురాకుండా కాంగ్రెస్ నే టార్గెట్ చేసిన కేసీఆర్

KCR targets only Congress in Nirmal
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నిర్మల్ లో పర్యటించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్వరలోనే బాసర ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. పునాదిరాయి వేయడానికి తానే వస్తానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

రెవెన్యూ శాఖలో  దోపిడీ నియంత్రణకే ధరణి పోర్టల్ తీసుకువచ్చామని, కానీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేయాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. తప్పుడు విమర్శలు చేసినవాళ్లే బంగాళాఖాతంలో కలుస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి ఉండాలో వద్దో ప్రజలే చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీరు కూడా ఇవ్వలేదని అన్నారు. 

దుర్మార్గులు మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతారని, రైతు బీమాకు జైభీమ్ చెబుతారని వ్యాఖ్యానించారు. అలాంటివాళ్ల మోసపు మాటలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. 

రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణది ప్రథమస్థానం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుల కళ్లలో ఆనందం కోసమే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 

సొంత స్థలం ఉన్నవారికి గృహ నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, నిర్మల్ సభలో కేసీఆర్ ఆశ్చర్యకరంగా ఎక్కడా బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఆయన ప్రసంగం సాగింది.
Go Back to Shorts
KCR
Nirmal
BRS
Congress
BJP

More Telugu News