ఆసుపత్రిలో శరత్ బాబును చూసి చిరంజీవి కళ్లలో నీళ్లు తిరిగాయి: సుహాసిని
- చెన్నై టీ నగర్ నివాసంలో శరత్ బాబు భౌతికకాయం
- నివాళులు అర్పించిన సుహాసిని
- ఒక పూట ఆసుపత్రిలో శరత్ బాబు వద్ద గడిపామని వెల్లడి
- తనతో పాటు చిరంజీవి కూడా ఉన్నారని వివరణ
ఆమె మీడియాతో మాట్లాడుతూ, శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను, చిరంజీవి కలిసి వెళ్లి ఆయనను పరామర్శించామని వెల్లడించారు. సగం రోజు అక్కడే ఉన్నామని, శరత్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించామని తెలిపారు.
"ఒక గంట పాటు పిలిచినా శరత్ బాబు నుంచి స్పందన లేదు. కళ్లు తెరవండి, మాట్లాడండి శరత్ అన్నా అని తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీష్ లో పిలిచాను. ఒక్కసారి మాత్రం ఆయన చేయి పైకెత్తారు. నువ్వు నన్ను చూసుకుంటావమ్మా చెల్లీ అన్న సంతృప్తి ఆయన కళ్లలో కనిపించింది. నేను శరత్ బాబును పిలుస్తుంటే చిరంజీవి కళ్లలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. సుహాసిని... మనం ఏం చేసైనా సరే శరత్ ను కాపాడుకుందాం అని చిరంజీవి అన్నారు. డాక్టర్లతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడారు... శరత్ బాబు కోసం చిరంజీవి చాలా బాధపడ్డారు" అని సుహాసిని వివరించారు.