Vimanam: తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్క‌రించే ‘విమానం’... హార్ట్ టచింగ్ ప్రోమో ఇదిగో!

  • సముద్ర ఖని ప్రధాన పాత్రలో విమానం 
  • శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో ద్విభాషా చిత్రం
  • జూన్ 9న గ్రాండ్ రిలీజ్
  • ప్రోమో విడుదల చేసిన చిత్రబృందం
Vimanam promo out now

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి పాత్రల‌తో రూపొందిన చిత్ర‌మే ‘విమానం’. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రించ‌నుందీ సినిమా. 

వైవిధ్య‌మైన పరిస్థితులు, వాటికి సరిపోయేటటువంటి సున్నిత‌మైన పాత్ర‌ల‌ను ఈ చిత్రంలో మ‌నం చూడొచ్చు. 'విమానం' సినిమాలో విలక్షణ నటుడు సముద్ర ఖని అంగవైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించారు. 

జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 9న ‘విమానం' రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, విమానం ప్రోమోను చిత్రబృందం శుక్ర‌వారం నాడు విడుద‌ల చేసింది. 

ప్రోమోను చూస్తే... తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి త‌న తండ్రి పాత్ర‌లోని స‌ముద్ర ఖ‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు. విమానం ఎక్కడానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా చ‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు. 

ఇందులో సున్నితంగా, చ‌క్క‌గా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను  రైట‌ర్, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల ప్రోమోలో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. 

ప్రోమో విడుదల సందర్భంగా జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ ‘‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ టీమ్‌గా ఏర్పడి భావోద్వేగాల క‌ల‌బోత‌గా బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందించిన చిత్రం విమానం. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ప్రేక్ష‌కులు న‌చ్చే, మెచ్చే కంటెంట్‌ను అందించ‌ట‌మే మా ల‌క్ష్యం. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం’’ అన్నారు. 

విమానం చిత్రంలో స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. 


More Telugu News