‘బలగం’ సినిమా బృందానికి ‘చిరు’ సన్మానం, అభినందన.. ఇదిగో వీడియో!

chiranjeevi appreciates balagam team
  • కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా
  • చిన్న సినిమాగా విడుదలై సంచలనం.. ప్రశంసల వెల్లువ
  • వేణు సహా చిత్ర బ‌ృందాన్ని అభినందించిన చిరంజీవి
  • ఇంత బాగా తీసి షాక్ ఇస్తే ఎలా? అంటూ నవ్వులు పూయించిన మెగాస్టార్
కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టిల్లు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా బలగం చిత్ర బృందాన్ని అభినందించారు. తాను నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా సెట్ లో.. ఈ రోజు బలగం టీమ్ ను సన్మానించారు. డైరెక్టర్ కమ్ కమెడియన్ వేణుకు అభినందనలు తెలిపారు. సినిమాను చక్కగా రూపొందించావంటూ ప్రశంసించారు. ‘ఇంత బాగా సినిమా చేసి మాకు షాక్ లు ఇస్తే ఎలా?’ అంటూ నవ్వులు పూయించారు.

‘‘నిజాయతీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ సినిమాకు నువ్వే పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించావు’’ అని చిరంజీవి కొనియాడారు. వేణు గతంలో జబర్దస్త్ షోలో చేసిన స్కిట్ చూశానని, అతడిలో ఇంత టాలెంట్ ఉందా? అనిపించిందని, ఒగ్గు కథలు వంటివి బాగా చేశాడని ప్రశంసించారు. అతడిపై గౌరవం పెరిగిందని చెప్పారు. ఈ సినిమా చూశాక తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడని అనిపించిందని తెలిపారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను హాస్య నటుడు ప్రియదర్శి ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘చిరంజీవి అన్నయ్యా.. మీ సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. అలాంటిది ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమను, మద్దతును పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బలగం సినిమా కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నా’’ అని ప్రియదర్శి రాసుకొచ్చారు.
Advertisement
Chiranjeevi
balagam
venu yeldandi
Dil Raju
bhola shankar

More Telugu News