హాలీవుడ్ అవకాశాలపై రామ్ చరణ్ గురి!
- అమెరికా సినీ పరిశ్రమలో భాగం కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
- భారత్ లోని ప్రతిభను ఇక్కడి దర్శకులు గుర్తించాలని సూచన
- అమెరికా టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న రామ్ చరణ్
తన సుదీర్ఘ అమెరికా పర్యటనలో భాగంగా రామ్ చరణ్ పలు టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. భారత్ వెలుపల అవకాశాల పట్ల తన ఆసక్తిని ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడి దర్శకులు భారత్ లో ఉన్న ప్రతిభను ఓసారి గమనించాలని కోరుకుంటున్నాను. మీ పరిశ్రమలోనూ (అమెరికా చిత్ర పరిశ్రమ) భాగం కావాలని అనుకుంటున్నాను. చక్కని కాల్స్, సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నాను’’అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ‘‘హెచ్ సీ ఏ క్రిటిక్స్ 2023 కు రాజమౌళి గారు, కీరవాణి గారితో కలిసి భారత సినిమాకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. మాకు లభించిన గౌరవానికి గర్వపడుతున్నాను’’అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేయడం గమనార్హం.
మరోవైపు మార్చి 1న ఏస్ హోటల్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించనున్నారు. అమెరికాలో మార్చి 3న 200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు ఈ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. దీని కోసం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ కూడా అమెరికాకు వెళ్లారు.