ఆమె కోసం ఆ సినిమాను 38 సార్లు చూశాను: నవీన్ చంద్ర
- ఈ నెల 4వ తేదీన రిలీజ్ అవుతున్న 'తగ్గేదే లే'
- నవీన్ చంద్ర సరసన ఇద్దరు నాయికలు
- కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- అడుగడుగునా ట్విస్టులు ఉంటాయని చెప్పిన టీమ్
శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు 'దసపల్లా కన్వెన్షన్' లో నిర్వహించారు. హీరో హీరోయిన్స్ తో పాటు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించిన మకరంద్ దేశ్ పాండే .. రవి కాలే .. పూజా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో తమ పాత్రల ప్రాధాన్యతను గురించి చెప్పారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ .. " ఈ సినిమా షూటింగు ఫస్టు లాక్ డౌన్ .. సెకండ్ లాక్ డౌన్ సమయంలో జరిగింది. ఆ సమయంలో టీమ్ లో ఎవరికీ కూడా పనిలేదు. అయినా ఈ సినిమా నిర్మాతలు రెండు షెడ్యూల్స్ కు సంబంధించిన పేమెంటును ముందుగానే ఇచ్చారు. ఇది వాళ్ల మంచి మనసుకు నిదర్శనం. ఒక వైపున దండుపాళ్యం గ్యాంగ్ .. మరో వైపున లవ్ స్టోరీ నడవడం ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశం. ఈ సినిమాలో కీలకమైన రోల్ చేసిన 'పూజా గాంధీ గారికి నేను వీరాభిమానిని. ఆమె హీరోయిన్ గా కన్నడలో చేసిన 'ముంగారు మలే' సినిమాను 38 సార్లు చూశాను. అలాంటి ఆర్టిస్ట్ తో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.