బంగాళాఖాతంలో దిశ మార్చుకోనున్న తుపాను
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- ఈ రాత్రికి తుపానుగా మారే అవకాశం
- దిశ మార్చుకుని బంగ్లాదేశ్ దిశగా పయనం
- ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు భారీ వర్షసూచన
గడచిన 6 గంటలుగా ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని ఐఎండీ పేర్కొంది. ఈ రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. తుపానుగా మారిన అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని, ఈ నెల 25 వేకువజామున బంగ్లాదేశ్ లోని టింకోనా ద్వీపం, సాంద్విప్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది.
నేడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఒడిశాలో నేడు, రేపు, ఎల్లుండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ బెంగాల్ లో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ నెల 25న బెంగాల్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
అటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా వర్షసూచన చేసింది. ఈ నెల 25 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.