అమ్మాయిలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదు.. తాలిబన్ల నయా రూల్!
- కో-ఎడ్యుకేషన్ విధానంపైనా నిషేధం
- షరియా చట్టాల ప్రకారమే విద్య
- ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటన
ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని తాలిబన్లు రూల్ తెచ్చారు. ఈ మేరకు ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ఒక ప్రకటన చేశారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేశారు.
ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్‌లో విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హక్కానీ అన్నారు. ఇప్పటి వరకూ నడిచిన విద్యా వ్యవస్థ షరియా చట్టాలకు విరుద్ధంగా నడిచిందని విమర్శించారు. అయితే తాలిబన్ల ఈ నిర్ణయాల పట్ల టీచర్లు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే బాలికలకు విద్య మరింత దూరమవుతుందని అంటున్నారు.