వెయ్యి కోట్లు కుమ్మరించినా.. పదేళ్లకే మూతపడిన జుకర్‌బర్గ్ భార్య స్కూల్

వెయ్యి కోట్లు కుమ్మరించినా.. పదేళ్లకే మూతపడిన జుకర్‌బర్గ్ భార్య స్కూల్

Priscilla Chan closes school despite spending one thousand crore rupees
  • మూతపడిన మార్క్ జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ పాఠశాల
  • 125 మిలియన్ డాలర్ల నిధులు ఆగిపోవడంతో బోర్డు నిర్ణయం
  • పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం అందించడమే ఈ స్కూల్ లక్ష్యం
  • విద్యాపరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం కూడా ఒక కారణం
  • పాఠశాల మూసివేతతో 540 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ది ప్రైమరీ స్కూల్' మూతపడింది. గత పదేళ్ల కాలంలో దాదాపు 125 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,000 కోట్లకు పైగా) పైగా నిధులను వెచ్చించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈ ఏడాది జూన్‌లో పాఠశాల కార్యకలాపాలను నిలిపివేశారు.

కాలిఫోర్నియాలోని ఈస్ట్ పాలో ఆల్టోలో 2016లో ఈ పాఠశాల ప్రారంభమైంది. దీనికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న 'చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్' (సీజెడ్ఐ), 2025-26 విద్యా సంవత్సరం తర్వాత నిధులను సమకూర్చలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పాఠశాల బోర్డు గతేడాది ఏప్రిల్‌లోనే సంస్థను మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ సంస్థ ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల కంటే శాస్త్రీయ పరిశోధనలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని సీజెడ్ఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

అల్పాదాయ కుటుంబాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్యం వంటి సమగ్ర సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రైవేట్ పాఠశాలను స్థాపించారు. అయితే, విద్యా ప్రమాణాల పరంగా ఈ పాఠశాల పనితీరు సగటు కంటే తక్కువగా నమోదైంది. దీనికి తోడు, తరచూ ప్రిన్సిపాల్స్ మారడం వంటి అంతర్గత సమస్యలు కూడా పాఠశాల పురోగతికి ఆటంకంగా మారాయి.

పాఠశాల మూసివేత ప్రకటన వెలువడే నాటికి రెండు క్యాంపస్‌లలో కలిపి సుమారు 540 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితులైన విద్యార్థులకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సీజెడ్ఐ 50 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
Advertisement
Priscilla Chan
Mark Zuckerberg
The Primary School
Chan Zuckerberg Initiative
East Palo Alto
School closure

More Telugu News