అమెరికాలోని ఆసియన్లపై దాడులు చూస్తుంటే భయమేస్తోంది: సత్య నాదెళ్ల
- సమాజంలో ద్వేషం, జాతి వివక్ష, హింసకు చోటు లేదని కామెంట్
- గత ఏడాది ఆసియన్లపై 3 వేల దాడుల ఘటనలు
- తోటి ఆసియన్లకు తోడుగా ఉంటానన్న సత్య నాదెళ్ల
‘‘ఏషియన్ అమెరికన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న ఆసియా వాసులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన సమాజంలో ద్వేషం, జాతి, వర్గ వివక్ష, హింసకు చోటు లేదు. ఇలాంటి అన్యాయాలను ఎదుర్కొనేందుకు తోటి ఆసియా ప్రజలు, ఏషియన్ అమెరికన్లకు నేను తోడుగా నిలబడతా’’ అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు. ఆసియన్లపై దాడులు ఏ రూపంలో ఉన్నా ఖండిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ద్వేషం, హింసకు తావు లేదని పేర్కొంది.
ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించిన మరుసటి రోజే సత్య నాదెళ్ల స్పందించారు. మరోవైపు ఏషియన్ అమెరికన్లపై దాడులను అరికట్టేందుకు వీలుగా చట్టాన్ని తీసుకొచ్చేందుకు పలువురు చట్ట సభ సభ్యులు ఏకమయ్యారు. అమెరికాలో ద్వేషం, హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని తేల్చి చెప్పారు. అమెరికన్లను దోషులుగా నిలబెట్టే దాడులను ఆపాలని కోరారు.