Advertisement

పీఓకేలో నరమేధం.. ఐరాసలో పాకిస్థాన్‌ను ఏకిపారేసిన భారత్

Genocide in PoK India slams Pakistan at United Nations
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అణచివేతపై ఐరాస మౌనాన్ని తప్పుబట్టిన భారత్ 
  • ఇతర దేశాలపై స్పందించే ఐరాస.. పాక్ దురాగతాలను ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీత
  • పీఓకేలో నిరసనకారుల హత్యలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ను ప్రస్తావించిన భారత్ 
  • జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టీక‌ర‌ణ‌
  • పాకిస్థాన్‌లో సైన్యం రాజ్యాంగ కుట్రకు పాల్పడిందని ఆరోపణ‌
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సహా పాకిస్థాన్‌ వ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) మౌనం వహించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇతర దేశాల్లోని ఇలాంటి పరిణామాలపై గొంతెత్తే ఐరాస.. పాకిస్థాన్ విషయానికి వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీసింది. ఐరాస భద్రతా మండలిలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా, భారత్ ఘాటుగా స్పందించింది.

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ మాట్లాడుతూ.. 'శాంతియుత వివాద పరిష్కార యంత్రాంగాలను బలోపేతం చేయడం' అనే అంశంపై జరిగిన చర్చలో పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచం ముందుంచారు. "పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు పాకిస్థాన్ అసలు నైజాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తున్నాయి. అక్కడ కశ్మీరీల ప్రాథమిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛను పాకిస్థాన్ దశాబ్దాలుగా కాలరాస్తోంది. ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా పాక్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగం" అని హరీశ్ స్పష్టం చేశారు.

తమ హక్కుల కోసం పోరాడుతున్న కశ్మీరీలను పాక్ ప్రభుత్వం కిరాతకంగా అణచివేస్తోందని భారత్ ఆరోపించింది. "గత జూన్ నుంచి ఇప్పటివరకు పాక్ భద్రతా దళాల చేతుల్లో 34 మంది కశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే జులై 14న తారార్‌ఖల్‌లో ఆరుగురు కశ్మీరీలను పాక్ దళాలు హతమార్చాయి" అని హరీశ్ వివరించారు.

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతోందో కూడా భారత్ ఎత్తిచూపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కల్పిత ఆరోపణలతో జైల్లో పెట్టడం, ఆయన పార్టీ పీటీఐని ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం వంటి చర్యలను ప్రస్తావించింది. దేశ చరిత్రలో నిరంతరం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలన సాగిస్తున్న పాక్ సైన్యం.. రాజ్యాంగంలోని 27వ సవరణ ద్వారా రాజ్యాంగ కుట్రకు పాల్పడిందని విమర్శించింది. ఈ సవరణ ద్వారా సైనిక ఉన్నతాధికారులకు జీవితకాలం పాటు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు కల్పించారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మతపరమైన కల్పిత కథనాలను ప్రచారం చేయడం మానుకుని, పాకిస్థాన్ తన సొంత సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హరీశ్ హితవు పలికారు. "జమ్మూ కశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగం. ఈ వాస్తవాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోవచ్చు. ఇక్కడ పరిష్కారం కాని ఏకైక సమస్య.. భారత సార్వభౌమ భూభాగాన్ని పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకోవడమే" అని ఆయన స్ప‌ష్టం చేశారు.
Advertisement
India
Pakistan Occupied Kashmir
United Nations Security Council
Human Rights Violations
P Harish UN
Jammu and Kashmir

More Telugu News