Chiranjeevi: 9 నుంచి చిరంజీవి 'ఆచార్య' షూటింగ్.. నెల రోజుల భారీ షెడ్యూల్!

  • చిరంజీవి, కొరటాల కాంబోలో 'ఆచార్య'
  • తాజా షెడ్యూలుతో చాలా వరకు పూర్తి
  • వేసవిలో సినిమా విడుదలకు సిద్ధం
  • ప్రకటించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ  
Chiranjeevis Acharya shoot will resume from Ninth of this month

లాక్ డౌన్ కారణంగా గత ఏడు నెలలుగా షూటింగుకి అంతరాయం కలిగిన సినిమాలలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' కూడా వుంది. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ హైదరాబాదులో జరిగింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో షూటింగులు మొదలవుతున్న నేపథ్యంలో 'ఆచార్య' చిత్రం షూటింగును కూడా ప్రారంభిస్తున్నారు.

ఈ నెల 9 నుంచి ఈ చిత్రం షూటింగ్ తిరిగి మొదలవుతుందని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ రోజు వెల్లడించింది. లాక్ డౌన్ అనంతరం, పక్కాగా రక్షణ చర్యలు తీసుకుని, ఈ నెల 9 నుంచి తిరిగి షూటింగును నిర్వహించడానికి ఉత్తేజభరితంగా ఉన్నామని సదరు సంస్థ ప్రకటించింది. ఇది నెల రోజుల భారీ షెడ్యూలనీ, ఇందులో చాలా భాగం చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో సందడి చేస్తుందని విడుదల విషయాన్ని కూడా ప్రకటించారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో గెస్ట్ గా నటిస్తున్నాడు. గతంలో చిరంజీవికి పలు సినిమాలలో హిట్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News