సభను చెడగొట్టాలని ప్రణాళికతో వచ్చారు.. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సభను చెడగొట్టాలని ప్రణాళికతో వచ్చారు.. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: చిరంజీవి

  • రసాభాసగా 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమం
  • చిరంజీవి, రాజశేఖర్ మధ్య వాగ్వాదం
  • రాజశేఖర్ పై చిరంజీవి ఆగ్రహం
హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా కొనసాగింది. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వాదన జరిగింది. సినీ పరిశ్రమలో అగ్గి రాజేసుకుందని... తన కారు ప్రమాదానికి కూడా 'మా' పరిస్థితే కారణమని అన్నారు. చిరంజీవి ప్రసంగాన్ని కూడా తప్పుబట్టారు. దాచిపెట్టినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు. తాను అన్నీ నిజాలు మాత్రమే చెబుతున్నానని తెలిపారు.

సభలో జరిగిన ఈ వివాదం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేదికపై ఉండగానే హీరో రాజశేఖర్ పరుషంగా మాట్లాడడాన్ని చిరంజీవి తీవ్రంగా పరిగణించారు. ఈ సభను రసాభాస చేయడానికి ముందే ప్లాన్ చేసుకుని వచ్చారని ఆరోపించారు. ఇది వెల్ ప్లాన్డ్ చర్య తప్ప మరొకటి కాదని అన్నారు.

"నేను చెప్పిందేమిటి... మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండని అన్నాను. ఆ మాటలను గౌరవించనప్పుడు, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటనిపిస్తోంది. బయటి ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం తప్ప ఈ గొడవ వల్ల ఒరిగిందేమిటి? ఎంతో సజావుగా సాగుతున్న ఈ సభలో దురుసుగా మైక్ లాక్కుని మాట్లాడడం ఏం మర్యాద? ఇప్పటికీ నేను స్పందించకపోతే నా పెద్దరికానికి విలువ లేదు. ఎంత సౌమ్యంగా మాట్లాడదామనుకున్నా సరే, నాతో కూడా ఆవేశంగా మాట్లాడిస్తున్నారు. దయచేసి దీన్ని ఇంతటితో ఆపేసి మంచిగా మాట్లాడుకుందాం. మనం ఏం చేద్దామో ఆలోచించండి. ఇది ఇష్టం లేనివాళ్లు రావడం ఎందుకు?" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

దాంతో రాజశేఖర్ మధ్యలో వచ్చి, "నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. నేను నిజాలు మాట్లాడకుండా ఉండలేను. నేను ఆ విధంగా బతకలేను" అంటూ తన వాదన వినిపించారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన వివాదంలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. "ఈ సభను ముందే చెడగొట్టాలని ప్రణాళికతో వచ్చారు కనుక మనం అలాంటివాళ్లకు ఏం సమాధానం చెప్పగలం? దీనికి ఏదైనా క్రమశిక్షణ చర్యలు ఉంటే గనుక తప్పనిసరిగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను" అంటూ బదులిచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలను సభలో ఉన్నవారు హర్షధ్వనాలతో స్వాగతించారు. 
Rajasekhar
Chiranjeevi
MAA
Tollywood

More Telugu News