చిన్నారుల ఉత్తుత్తి సెల్ఫీకి సెలెబ్రిటీలు ఫిదా!
- సెల్ఫీ దిగుతున్నట్టుగా ఫీలైన ఐదుగురు చిన్నారులు
- సెల్ ఫోన్ బదులు చేతిలో స్లిప్పర్ పట్టుకున్న వైనం
- సామాజిక మాధ్యమాలకు చేరిన ఈ ఉత్తుత్తి సెల్ఫీ
ఐదుగురు చిన్నారులు.. సెల్ఫీ దిగుతున్నట్టుగా ఫీలవుతూ, చిరునవ్వులు చిందించారు. ఓ చిన్నారి ఓ స్లిప్పర్ (చెప్పు)ను సెల్ ఫోన్ మాదిరి తన చేతిలో ఉంచుకోగా, మిగిలిన నలుగురు చిన్నారులు అటువైపే చూస్తూ నవ్వుతూ ఉత్తుత్తి సెల్ఫీ దిగారు. ఈ దృశ్యాన్ని గమనించిన ఎవరో తన ఫోన్ లో ‘క్లిక్’ మనిపించాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, సునీల్ శెట్టి తదితరులు ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ‘మీరు ఎంచుకున్న దాన్ని అనుసరించే మీరు సంతోషంగా ఉంటారు’ అని బొమన్ ఇరానీ ఆ ఉత్తుత్తి సెల్ఫీకి క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. అమితాబ్ మాత్రం ఈ ఫొటోపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఫొటోషాప్ లో చేసిన గిమ్మిక్కు ఏమోనన్న అనుమానం ఉందన్నారు.