నేడు శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు!
- కేంద్రం వైఖరిని ఎండగట్టనున్న టీడీపీ అధినేత
- రామ్మూర్తి నాయుడు స్టేడియంలో వేదిక ఏర్పాటు
- సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నష్టపోయిందో నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. 2014లో ఏపీ పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం తీవ్రంగా విఫలం అయిందని తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీ, విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ సహా ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకే ఈ దీక్షను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీకాకుళంలో కొత్తగా నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.