పెళ్లి చేసుకుంటానంటే జోక్ అనుకున్నారు.. చివరికి పెళ్లి చూపుల్లో ఆమెనే తెచ్చి కూర్చోబెట్టారు!
Add ap7am to your home Screen

పెళ్లి చేసుకుంటానంటే జోక్ అనుకున్నారు.. చివరికి పెళ్లి చూపుల్లో ఆమెనే తెచ్చి కూర్చోబెట్టారు!

  • వరంగల్ జిల్లాలో ఘటన
  • ప్రేమించిన యువతిని పెళ్లాడిన విక్రమ్
  • సినిమాను తలపిస్తున్న ట్విస్ట్
ఏదైనా మనకు రాసిపెట్టి ఉండాలంటే ఇదేనేమో. ఓ పెళ్లి వేడుకలో యువతిని చూసిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏదో తమాషాకు చెబుతున్నాడులే అంటూ కుటుంబ సభ్యులు, ఇతరులు లైట్ తీసుకున్నారు. చివరికి పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడికి ఎదురుగా తాను ఇష్టపడ్డ అమ్మాయే ప్రత్యక్షం కావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వరంగల్ జిల్లాకు చెందిన పడాల విక్రమ్ పుట్టుకతోనే మూగ, చెవుడు. పదో తరగతి వరకూ పెద్దపెండ్యాలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో చదువుకున్న విక్రమ్ హైదరాబాద్ లోని హెలెన్ కెల్లర్ కళాశాలలో బీకాం(కంపూటర్స్) పూర్తిచేశాడు. ఈ క్రమంలో తన వదిన కీర్తన పుట్టిన రోజు వేడుకలను ఈ నెల 24న హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సౌమ్య అనే అమ్మాయిని చూసి విక్రమ్ ఇష్టపడ్డాడు. అమ్మాయికి అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని వికాస కేంద్రం నిర్వాహకులకు తెలిపాడు.

అయితే విక్రమ్ సరదాగా చెబుతున్నాడని భావించిన నిర్వాహకులు, కుటుంబ సభ్యులు అతని మాటలను పట్టించుకోలేదు. అనంతరం విక్రమ్ కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కులం పట్టింపు లేకుండా పెళ్లికి సిద్ధం కావడంతో హన్మకొండలోనే డిగ్రీ చదివిన మూగ, చెవుడు అమ్మాయి ఉందని మధ్యవర్తి ఒకరు తెలిపారు. దీంతో విక్రమ్ పెళ్లి చూపులకు అయిష్టంగానే సిద్ధమయ్యాడు. చివరికి అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లికూతురిని చూడగానే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే.. విక్రమ్ వదిన పుట్టిన రోజు సందర్భంగా  చూసిన అమ్మాయి.. పెళ్లి చూపుల్లో తాను చూస్తున్న అమ్మాయి ఒక్కరే కాబట్టి. చివరికి తాను ఇష్టపడ్డ అమ్మాయి సౌమ్యతో  విక్రమ్ వివాహం గురువారం అంగరంగవైభవంగా జరిగింది.
marriage
Telangana
Warangal Urban District

More Telugu News