దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపుతున్న 'మురసు' తీవ్ర తుపాను కారణంగా రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం 'మురసు' తీవ్ర తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది బాపట్లకు 40 కి.మీ, ఒంగోలుకు 50 కి.మీ, విజయవాడకు 90 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరుతో పాటు నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ కీలక సూచనలు జారీ చేశారు. "భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు.

అయితే, 'మురసు' తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి ఈదురుగాలుల తీవ్రత కూడా తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు. అయినప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి హెచ్చరికలు తొలగించే వరకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.