బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భద్రతను గణనీయంగా పెంచుకున్నారు. ప్రతి ఆదివారం ముంబైలోని తన నివాసం 'జల్సా' వెలుపల అభిమానులకు అభివాదం చేసే ఆయన, నిన్న మాత్రం బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్ వెనుక నుంచి కనిపించారు. ఆయన నివాసానికి బాంబు బెదిరింపులు రావడం, నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు స్పష్టమవుతోంది.

అక్టోబర్ 23న ముంబై మేయర్‌కు అందిన ఒక ఈ-మెయిల్‌లో అమితాబ్ నివాసం జల్సాపై దాడి చేస్తామని దుండగులు హెచ్చరించారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య ఈ దాడి జరగవచ్చని పేర్కొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి తోడు, రెండు వారాల క్రితం జుహూ ప్రాంతంలోనే నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ష్రాఫ్ సురక్షితంగా బయటపడినప్పటికీ, బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.

టైగర్ ష్రాఫ్ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు, పర్యాటకుల ముసుగులో అమితాబ్ బచ్చన్‌తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర నటుల ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించినట్లు తేలింది. బాలీవుడ్‌లో భయాందోళనలు సృష్టించి, తమ ఉనికిని చాటుకోవడమే వారి లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు.

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో అమితాబ్ తన భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. సాధారణంగా అభిమానులకు దగ్గరగా కనిపించేందుకు వీలుగా చక్రాలున్న పీఠంపైకి వచ్చే ఆయన, ఇప్పుడు దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను ఏర్పాటు చేయించారు. ఈ భద్రతా ఏర్పాట్లను ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నారా? లేక పోలీసుల సూచనల మేరకు జరిగిందా? అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా బాలీవుడ్‌ను కమ్మేసిన భద్రతాపరమైన ఆందోళనలకు ఈ ఘటన అద్దం పడుతోంది.