విశాఖ పోర్టు ట్రస్ట్ పరిధిలో ఈ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఉన్న జేఎం భక్షి కంపెనీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఓ కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో పోర్టు సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే, మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో కన్వేయర్ బెల్ట్‌పై ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో పాటు, దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే విశాఖ పోర్టు ట్రస్ట్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కన్వేయర్ బెల్ట్ వద్ద జరుగుతున్న వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన నిప్పురవ్వలే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోర్టు అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.