జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2027కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక సూచనలు జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో, విద్యార్థులు అప్లికేషన్ నింపేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ సలహాలు పాటించాలని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖ్యంగా డిజిలాకర్ ఆధారాలను, ఇతర ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

"జేఈఈ మెయిన్ 2027 అభ్యర్థులు తమ ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించేందుకు, దరఖాస్తు నింపడానికి ముందే మూడు విషయాలు సిద్ధంగా ఉంచుకోవాలి" అని ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. విద్యార్థులు తమ సొంత డిజిలాకర్/జనప్రిచయ్ వివరాలనే వాడాలని, డిజిలాకర్ రీ-కేవైసీని ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది. అలాగే, దరఖాస్తులో నింపే పేరు, పుట్టిన తేదీ వివరాలు పదో తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలతో కచ్చితంగా సరిపోలాలని స్పష్టం చేసింది. "జాగ్రత్తగా దరఖాస్తు చేసి, మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి!" అని ఎన్టీఏ పేర్కొంది.

జేఈఈ మెయిన్ 2027 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభం కాగా, నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. తొలి విడత (సెషన్ 1) పరీక్షలు 2027 జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో పలు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి నవంబర్ 26 చివరి తేదీ. డిసెంబర్ 30న అభ్యర్థులకు పరీక్షా కేంద్రం ఉన్న నగరం వివరాలను వెల్లడించి, 2027 జనవరి 13 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్ 1 నిర్వహిస్తారు. ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఇది అర్హత పరీక్షగా కూడా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్ 2 నిర్వహిస్తారు. 2027-28 విద్యా సంవత్సరానికి గానూ జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు సెషన్లలో, అంటే 2027 జనవరి,  2027 ఏప్రిల్ లలో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.