మందులతో అదుపులోకి రాని అధిక రక్తపోటు (హై బీపీ) సమస్యకు ఒక కొత్త, సులభమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా, చెవికి అమర్చే ఒక చిన్న పరికరం ద్వారా బీపీని నియంత్రించే టెక్నాలజీపై వారు పరిశోధనలు చేస్తున్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించారు. ఈ అధ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ 'హైపర్‌టెన్షన్'లో ప్రచురితమయ్యాయి.

పరికరం ఎలా పనిచేస్తుంది?
ఈ టెక్నాలజీని "ట్రాన్స్‌క్యుటేనియస్ అటానమిక్ న్యూరోమాడ్యులేషన్ (tAN)" అని పిలుస్తున్నారు. ఇది చేతిలో ఇమిడిపోయే ఒక చిన్న పరికరం. దీనికి ఉండే రెండు చిన్న క్లిప్‌లను చెవి బయట ఉండే మృదులాస్థి (ట్రాగస్) భాగానికి తగిలించాలి. ఈ క్లిప్‌ల ద్వారా తక్కువ స్థాయి విద్యుత్ సంకేతాలను పంపి, శరీరంలోని రక్తపోటు, జీర్ణక్రియ వంటివాటిని నియంత్రించే అటానమిక్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడమే దీని లక్ష్యం. అఫెరెంట్ మెడికల్ సొల్యూషన్స్ సంస్థ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. రోగులు దీన్ని ఇంట్లోనే సొంతంగా వాడుకునేలా రూపొందించారు.

పరిశోధనలో ఏం తేలింది?
ఈ పరిశోధనలో భాగంగా, ఇప్పటికే బీపీ మందులు వాడుతున్నా రక్తపోటు అదుపులో లేని 63 మందిని ఎంపికచేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపుకు యాక్టివ్ పరికరాన్ని, మరో గ్రూపుకు డమ్మీ (ప్లేసిబో) పరికరాన్ని ఇచ్చారు. అయితే, మొత్తం మీద చూసినప్పుడు డమ్మీ పరికరం వాడిన వారితో పోలిస్తే, యాక్టివ్ పరికరం వాడిన వారిలో బీపీ గణనీయంగా తగ్గినట్లు ఆధారాలు లభించలేదు.

అయితే, మందులకు ఏమాత్రం లొంగని తీవ్రమైన రక్తపోటు ఉన్న రోగులలో మాత్రం సానుకూల ఫలితాలు కనిపించాయి. యాక్టివ్ పరికరం వాడిన వారిలో బీపీ స్పష్టంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరికరం సురక్షితమని, వాడటానికి సులువుగా ఉందని తేలింది.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ అజయ్ గుప్తా మాట్లాడుతూ.. "ఇది చాలా ఆసక్తికరమైన సాంకేతికత. భవిష్యత్తులో లక్షలాది మందికి తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపగలదు. అయితే, దీని సామర్థ్యాన్ని పూర్తిగా నిర్ధారించడానికి, ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని పెద్ద అధ్యయనాలు అవసరం" అని స్పష్టం చేశారు. తీవ్రమైన బీపీ రోగులకు ఇది ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, రోజూ వాడే బీపీ మాత్రలకు ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేయడానికి ముందు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.