రేవంత్ సర్కారుపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.. టెండర్లలో భారీ అవకతవకలంటూ ఆరోపణ!
Add ap7am to your home Screen

రేవంత్ సర్కారుపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.. టెండర్లలో భారీ అవకతవకలంటూ ఆరోపణ!

Komatireddy Rajgopal Reddy fires at Revanth government alleging huge irregularities in tenders
  • రేడియల్ రోడ్ టెండర్లలో అవకతవకలంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపణ
  • రూ.600 కోట్లు తక్కువకు బిడ్ వేసినా తమను తప్పించారని మండిపాటు
  • సీఎం రేవంత్ శాఖలోనే దోపిడీ జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ఆధ్వర్యంలో చేపట్టిన రూ.3,296 కోట్ల రేడియల్ రోడ్-2 నిర్మాణ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

తమ సొంత ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరమని ఆయన అన్నారు. మూడు ప్యాకేజీలకు గానూ ఇతర సంస్థల కన్నా రూ.600 కోట్లు తక్కువకు తమ కంపెనీ బిడ్లు దాఖలు చేసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నిబంధనలు పెట్టి తమను పక్కనపెట్టారని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండే శాఖలోనే ఈ దోపిడీ జరగడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

టెండర్లలో పాల్గొనవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్లు వచ్చాయని, అయినా తాము పోటీలో నిలిచామని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. తమ కంపెనీని అనర్హులుగా ప్రకటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, న్యాయపరంగా సుప్రీంకోర్టు వరకు పోరాడతానని హెచ్చరించారు.

గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పరిణామాలనే ఇది గుర్తు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, రేవంత్ రెడ్డి చేసినా తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. ఇలాంటి దోపిడీ జరుగుతుంటే ఢిల్లీలో పార్టీ నిర్వహించే నిరసనలో ఎలా పాల్గొంటానని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఇటువంటి అవినీతిపై పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 
Advertisement
Komatireddy Rajgopal Reddy
Revanth Reddy
Telangana Congress Internal Rift
HGCL Radial Road Tenders
Hyderabad Growth Corridor Limited
Telangana Government Corruption Allegations

More Telugu News